ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా
ఘనదేవ ప్రియ తనయుండా /
జగద్రక్షా/ వినుతి జేతుము నీ మహిమన్
ఘనతరంబుగ / గతసంవత్సర /
దినములన్నిటమాకు నీభువి /
ఘనసుఖము లొనరించి మరి /
నూతనపు వత్సర మొసగినందుకు ॥ఘనదేవ॥
1.
అధిక ప్రేమలొసఁగుము / యేసు ప్రభు /
కుదురుగ నీ వత్సరము /ప్రధమ దినమున /
మమ్ము నందరి /
ముదముతో నిచ్చటకుఁ జేర్చితి /
ప్రబలమగు సంగీతస్తుతులను /
మిగులబొందుము యేసు రక్షక ॥ఘనదేవ॥
2.
అంచితముగ నిచ్చటన్ / గూడిన సభలో /
స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ /
మంచి మార్గమునుంచి నీ /
యత్యంత ప్రేమతోఁగావు మిలను /
చంచలులు గాకుండ నీ కృప /
లుంచి మము రక్షించుమో ప్రభు ॥ఘనదేవ॥
3.
దీవించు ప్రభుయేసువా / సువార్తికులన్ /
సావధానముగా భువిలో /
భావమందున నీ పదంబుల /
సేవ బాగుగఁ జేయుచున్ నీ /
జీవజల వాక్యంబులన్ ధర ధీరతనుఁ /
బ్రకటింపఁ జేయుము ॥ఘనదేవ॥
4.
పరముండ ధర నీ సభలన్ /నూతనముగ/
స్థిరపర్చి బలపర్చుము /
సరసముగ నాశీర్వచనము /
ల్విరివిగా నొసంగుచున్ నూ /
తన సహోదర ప్రియుల సమితిని /
మరియుఁ జేర్చుము నీ సభలలో ॥ఘనదేవ॥
5.
కరుణాళ యీవత్సరము / క్రైస్తవ బడుల/
ధరణిబ్రబలఁ జేయుమా /
సరిగ నుపాధ్యాయులందరి /
మరి మరీ దీవించు ప్రభువా /
స్థిరముగా పరమార్థములు బా-లురకు
గరపుచునుండఁ జేయుము ॥ఘనదేవ॥
6.
భాసురంబుగపరలోక / ప్రకాశుఁడా /
దాసబృందములన్ గావు /
వాసిగా నరలోకము నని /
వాసులగు మీ దాసులందరి /
దోషరాసిని ద్రోసి నీ కృప /
జూపుచును రక్షించు మనిశము ॥ఘనదేవ॥
రచన: గొల్లపల్లి ఆండ్రెయ్య